మరో రెండు మూడ్రోజుల్లో రాంగోపాల వర్మ వివాదాస్పద సినిమా రక్త చరిత్ర విడుదల కానుంది. సగటు సినీ ప్రేక్షకుడు, సినీ ప్రేమికుడు ఆ సినిమా కోసం అంత నోరు తెరుచుకొని ఎదురు చూడకపోయినా మీడియా మాత్రం ఆ సినిమాకి చాలాఎక్కువ హైపూ, వర్మలో కైపూ నింపి మొత్తమ్మీద ఆ సినిమాని most eagerly awaited movie కింద చేసి పారేశారు.
నేను మాత్రం ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా, ఎప్పుడెప్పుడు ఫ్లాపవుతుందా అని వేచి చూస్తున్నాను. నాకు వర్మ మీద కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. నాకున్న కోపమల్లా ఆ సినిమా సబ్జెక్టు మీద ఆ కాన్సెప్టు మీదా. అంతే.
సినిమాలలో వయెలెన్సు కొత్త కాదు. కొన్ని సినిమాలలొ హింసని ప్రేక్షకుడు సమర్ధిస్తాడు. ఆ హింసని జస్టిఫై చేసేలాగా దర్శకుడు కథని అల్లుకొంటూ వస్తే అప్పుడు హింస ఏహ్యభావం పుట్టించదు.
నాయకుడు సినిమాలో వీరయ్య దుర్మార్గుడైన పోలీసుని సమ్మెటతో తలమీద మోది చంపితే వాడికి ఆ శాస్తి జరగాల్సిందే అనుకోంటాడు ప్రేక్షకుడు. తన భార్యని చంపిన వాళ్ళని తన మనుషులతో వేటాడి చంపితే అప్పుడూ అలా జరగాల్సిందే అనిపిస్తుంది.
స్పార్టకస్ సినిమాలో కానీ, ఒమర్ ముక్తర్ లో కానీ, పేట్రియాట్, 300, ఇలా అనేక సినిమాలలో హింసని ప్రేక్షకుడు అసహ్యించుకోడు. ఆ సన్నివేశాలలో ఆ హింసకి జస్టిఫికేషన్ ఉంటుంది.
కానీ రక్త చరిత్రలో పాత్రదారులందరూ చరిత్ర హీనులే. వాళ్ళు హింసకి పాల్పడేది ఏదో ఆశయ సాధనకోసం కాదు. తరతరాలుగా వస్తున్న తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, తమ ఆస్తులూ, బలగం పెంచుకోవడానికి, ఉన్న పదవులు కాపాడుకోవడానికి లేదా పదవులు సంపయించడానికీ.
కొంపతీసి ఈ సినిమా హిట్టయితే బాలక్రిష్ణ సినిమా సమర సింహా రెడ్డి హిట్టయ్యాక తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఆ ఒక్క సినిమా హిట్ తో ఆది కేశవ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి, భరత సింహా రెడ్డి, ఇంద్ర సేనా రెడ్డి ఇలా కుప్పలు తెప్పలుగా ఫాక్షన్ హీరోలు పుట్టుకొచ్చారు.
ఇప్పుడు రక్త చరిత్ర కానీ హిట్టయితే రాష్ట్రంలో ఇంకా అనేకానేక కుటుంబ కక్షల మీద సినిమాలు తయారవుతాయి. ఈ రాష్ట్రంలో ఈ కథలకు తక్కువేమీ లేదు. విజయవాడ రౌడీల మీద వర్మ తనే ఒక సినిమా తీస్తున్నాడు. కర్నూలు, కడప, అనంతపురం ఇలా ఒక్కో చోట ఉన్న ఒక్కో నిచ నికృష్ట కథనీ మన వాళ్ళు తెరకెక్కించి చంపుకు తింటారు.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ, సినిమా ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రక్త హీన చరిత్ర ఎత్తి పోవాలని నా కోర్కె.