రెండు రోజుల క్రితం మా ఊరినుండి ఒకావిడ వచ్చింది హాస్పిటల్ లో చూపించుకోవడానికి. ఆమె కోస్తాంధ్రలో ఒక జిల్లా కేంద్రంలో ఉంటుంది. విషయమేమిటంటే తను స్థానికంగా ఒక హాస్పిటల్ లో రెండు నెలల క్రితం వెన్నుపూసకి ఆపరేషన్ చేయించుకొంది. ఆపరేషన్ చేశాక కూడా నొప్పి తగ్గక పోవడంతో సెకండ్ ఒపీనియన్ కోసం హైదరాబాద్ వచ్చింది.
వెన్నుపూస నొప్పిగా ఉందని హాస్పిటల్ కి వెళితే వాళ్ళు స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలి లేకుంటే ప్రమాదం అని చెప్పారని ఈమె ఆపరేషన్ చేయించేసుకొంది. ఆపరేషన్ తరువాత నొప్పి మరింత ఎక్కువైతే ఇంకో చోట చూపించుకోవాలని వచ్చింది.
తను ఆరోగ్యశ్రీ కార్డుమీద ఆపరేషన్ చేయించుకొన్నాని చెప్పగానే నాకు అది అనవసర ఆపరేషన్ అని అనుమానం వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాకు బాగా తెలిసిన ఒక న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆవిడ దగ్గరున్న పాత ఎక్స్ రేలు చూసి, మళ్ళీ సరికొత్తగా ఎక్స్ రేలు తీయించి అసలామెకు ఆపరేషన్ అవసరమే లేదని ఆమెకు చేసింది అనవసర ఆపరేషన్ అని తేల్చేశాడు.
సైన్సు స్టూడెంటుని కావడం వల్ల, డాక్టర్లతో బాగా పరివయం ఉన్నందు వల్ల, ఆ డాక్టర్ నాకు బాగా తెలిసిన వాడయినందువల్ల, ఆ డాక్టర్ ఒక పావుగంట నన్ను కోర్చోబెట్టి అతని సబ్జెక్టు కొంచెం క్లాసు పీకాడు.
ఆ క్లాసు సారాంశమేమిటంటే: ఆమెకి ఉన్న కండీషన్ spondylolisthesis Grade I. అందులో నాలుగు గ్రేడ్లుంటాయి. మొదటిది తక్కువ తీవ్రత, పోయేకొద్దీ తీవ్రత పెరుగుతుంది. Grade I కి ఆపరేషన్ అవసరం లేదు. కొన్ని రకాల పనులు తగ్గించుకొని నడుముకి బెల్టు ధరిస్తే సరిపోతుంది. చాలాసార్లు Grade II లో కూడా ఆపరేషన్ అవసరం ఉండదు. కొన్ని సార్లు Grade III లో కూడా ఆపరేషన్ లేకుండా వైద్యం చేయవచ్చు.
మరి ఆమెకు ఆపరేషన్ ఎందుకు చేయవలసి వచ్చిందయ్యా అంటే ఆరోగ్యశ్రీలో ఆ ఆపరేషన్ కి 65,000 రూపాయల ప్యాకేజి వస్తుంది. ఆ ఆపరేషన్ చేసినందుకు హాస్పిటల్ కి మహా అయితే పదిహేనో, ఇరవయ్యో వేలు ఖర్చవుతుంది. అప్పనంగా అంత డబ్బు వస్తుంటే ఎవరికి మాత్రం చేదవుతుంది చెప్పండి.
మరి ఆరోగ్యశ్రీలో ఈ అనవసర ఆపరేషన్ ల గురించి చెక్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. అది ఎలా అంటే ఆపరేషన్ కోసం అనుమతి రావాలంటే పేషంటుకి సంబంధించిన ఎమ్మారై స్కాన్ ని స్కానర్ ద్వారా ఆరోగ్యశ్రీ హెడ్డాఫిసుకి పంపిస్తే అక్కడ ఒక డాక్టర్ చూసి అనుమతి మంజూరు చేస్తాడు. ఆ అనుమతి కేవలం స్కాన్ చూసే ఇస్తారు. అందులో ప్రాబ్లం ఉందా లేదా అన్నదే వాళ్ళు చూస్తారు. ఎంత తీవ్రత ఉందో పట్టించుకోరు. ఇంకో గమ్మత్తయిన విషయమేమిటంటే ఏ స్పెషాలిటీకి చెందిన డాక్టర్ ఆ స్పెషాలిటీ కేసులు చూస్తారా అంటే అది లేదు. అంచేత హాస్పిటల్ వాళ్ళు పెట్టిన అప్లికేషన్( ప్రీ ఆథరైజేషన్) లో ఉన్న ఆపరేషన్ ఆరోగ్యశ్రీ జాబితాలో ఉందా లేదా అన్నదే చూస్తారు గానీ, అది పేషంటుకి అవసరమా లేదా అని చూడరు.
ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్డుతో ఎవరయినా హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళని బంగారు బాతుల్లాగా మార్చేస్తుంటారు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు.
కాబట్టి కార్డుదారులూ జగ్రత్త. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఉచితంగా చేస్తున్నారు కదా అని కక్కుర్తి పడి మీ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు.
5 comments:
why can't you post that hospital name and location?
This is true, one of my relative was hospitalized in Nellore and the operation costed him around 3 lkahs (obviously the operation was unnecessary)
Harish, if you write about it in detail, it will help others.
బాగానే చెప్పారు కాని
మరిన్ని వివరాలు కావాలండి
Hospital name , patient Details లాంటివి
Post a Comment