నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, April 21, 2010

నేను చదివిన చెత్త నవల తులసిదళం

ఈ మధ్య పాత పుస్తకలు సర్దుతూ ఉంటే యండమూరి నవల తులసిదళం కనిపించింది.అదే ఈ పోస్టుకి కారణం.నా అభిప్రాయం ఏదైన ఈ నవల తెలుగు నవలా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ అని ఒప్పుకోవాలి.ఈ నవల తరువాత యండమూరి లాంటి రచయిత నభూతో నభవిష్యతి అని కొందరూ, యండమూరికి భూతాల్లేకపోతే భవిష్యత్తు లేదని మరికొందరూ వ్యాఖ్యానించారు.
Yandamuri Veerendranath
ఇలాంటి బెస్టు సెల్లరు నవలని నేనెందుకు చెత్త నవల అంటున్నానో ఇక్కడరాస్తాను.ఈ పోస్టు చదివే వాళ్ళలో ఎక్కువమంది ఈ నవలని చదివి ఉంటారని నెను అనుకోవడం లేదు కాబట్టి టూకీగా ఇతివృత్తం రాస్తాను.

శ్రీధర్ అనే ఇంజినీరు,అతనికి తులసి అనే ఒక పాప,శ్రీధర్ పనిచేసే కంపెనీలో ఒక విదేశీ ఇంజినీరు ఆమె పెరు మీద కొంత ఆస్తి వ్రాసి వెళ్తాడు.అయితే అందులో ఒక ఫిట్టింగు పెడతాడు.ఆమెకి పన్నెం డు యేళ్ళు వచ్చే లోపల ఆమె చనిపోతే ఆ ఆస్తి ఒక ఆశ్రమానికి వెళ్తుంది.ఆ ఆశ్రమాన్ని నమ్ముకొని కొందరు విలన్ గాళ్ళు ఉంటారు.వాళ్ళకి ఆ ఆస్తితో చాలా అవసరం ఉంటుంది.ఆ పాపని ఎలాగైన చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు.అయితె తమ మీద అనుమానం రాకుండా చంపడానికి ఒరిస్సాలోని ఒక మంత్రగాడి ద్వారా కాష్మోరా అనే ఒక క్షుద్రశక్తిని ప్రయోగిస్తారు.శ్రీధర్ నాస్తికుడు కాబట్టి ఇవన్నీ నమ్మడు.కాష్మోరా వల్ల ఆ పాప పడ్డ భాధలూ,చివరికి శ్రీధర్ తన నమ్మకాన్ని మార్చుకొని కాష్మోరాని తిప్పికొట్టడంతో నవల ముగుస్తుంది.

మధ్యలో ప్యారలల్ గా ఇంకో ట్రాక్ ఉంది.పాప చేతికి ఒక తాయత్తు కట్టి అందులో ఒక రిసీవర్ అమర్చి దానికి మోర్సు కోడ్ లో నీ గుండె ఆగిపోతూంది...ఆగిపోతూంది అని సందేశం పంపించి ఒక ఇంజినీరు హిప్నటిజం ద్వారా ఆమె గుండెని ఆపే ప్రయత్నం చేస్తాడు.

ఆమె గుండె ఆగిపోతూన్న క్షణంలో ఒక డాక్టరు ఆమె గుండెని ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి మసాజ్ చేసి మళ్ళీ ఆడేలా చేస్తాడు.అదే క్షణంలో ఆమె చేతికి ఉన్న తాయెత్తుని తీసి వేస్తాడు.సరిగ్గా అదే క్షణంలో ఒరిస్సాలోని బిస్తా గ్రామంలో తన నమ్మకన్ని మార్చుకొన్న శ్రీధర్ మంత్రగాడైన కాద్రా పళ్ళు రాలగొట్టి అతడు మంత్రాలు స్పష్టంగా పలకలేకపోయేల చేస్తాడు.దానితో అప్పటివరకూ అతడి అదుపాగ్నల్లో ఉన్న క్షుద్రశక్తులు అతనికి ఎదురు తిరిగి అతన్ని పీక్కుతింటాయి.
పాప కష్టానికి కారణం ఏదైనా గుండె జబ్బా,తాయెత్తులోంచి వచ్చిన సందేశం వల్ల ఆమె గుండె ఆగిపోబోయిందా,లేక కాష్మోరా ప్రభావమా అలాగే ఆమె బ్రతకడానికి కారణం గుండెకి డాక్టరు ఆపరేషన్ చేయడమా,తాయెత్తుని పీకి వేయడమా,లేక మాంత్రికుడిని చంపి వేయడమా అన్నది పాఠకులు తేల్చుకోవాలి.

ఈ నవల అప్పట్లో పెద్ద హిట్.ఆంధ్రభూమి వార పత్రికలో సీరియల్ గా వచ్చి సంచలనం అయ్యింది.క్షుద్ర సాహిత్యం అని కొంత మంది పెదవి విరిచినా చాలామంది ఎగబడి చదివారు.తరువత చందు సోంబాబు అని ఇంకో రచయిత అదే పత్రికలో కాష్మోరా అని ఒక నవలని ఇంచుమించు ఇదే కథతో రాశాడు.

హిట్టో ఫట్టో ఇప్పుడు చర్చ అనవసరం.ఇందులో తమాషాగా అనిపించె విషయం ఏమిటంటే తాయెత్తు వ్యవహారం.పాప చేతికి తాయెత్తు,అందులో ఒక రిసీవరు,దానికి ఎక్కడో ఒక ట్రాన్స్ మీటర్ లోంచి సిగ్నల్ పంపితే ఆ సిగ్నల్ పాప చేతికి ఆమె గమనించలేనంత తక్కువ మోతాదులో షాక్ ఇస్తుంది.ఆ షాక్ తక్కువ వ్యవధిలో ఉంటే డాట్ అంటే చుక్క కొంచెం ఎక్కువ వ్యవధిలో ఉంటే గీత అంటే డాష్,ఈ చుక్క గీతలు కలిపి చదివితే టెలిగ్రాఫ్ లో వాడే మోర్సు కోడ్ అవుతుంది.ఆ కోడ్ లో యువర్ హార్ట్ ఈజ్ గోయింగ్ టొ స్టాప్ అని పంపిన సందేశాన్ని పాప చేతికున్న చర్మం డీకోడ్ చేసి దాన్ని ఆమె గుండెకి పంపి గుండె ఆగిపోయేలా చేయడం అన్నది ఏమాత్రం తెలివున్న వారయినా నవ్విపోయే విషయం.

ఇలాంటివి ఇందులొ చాలా ఉన్నాయి.ఇంత కన్న తమాషా దీనికి సీక్వెల్ గా వచ్చిన తులసి నవలలో ఉంది.ఇందులో హీరో/విలన్ అయిన దార్కా అనే మంత్రగాడికి ఆరత్యుంగ విద్య అనే విద్య తెలుసు.కంటి చూపుతో అగ్ని పుట్టించడమే ఈ విద్య.దీనికి సైంటిఫిక్ టచ్ ఇస్తాడు రచయిత.కొన్ని మూలికల కషాయంతో కంటిలోని లెన్సుని మార్చి భూతద్దం సూర్యకాంతినుంచి నిప్పు పుట్టించినట్టు కంటిలోంచి నిప్పు పుట్టించవచ్చు కదా అన్న సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేస్తాడు.ఇది వీలవుతుందా లేదా అనంది పాఠకులె తేల్చుకోవాలని వదిలి వేస్తాడు.

ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం మార్కెట్లో బాగా డిమాండు ఉన్న వ్యక్తల్లో యండమూరి ఒకరు.ఆయన్ని తన ఈ రెండు నవలల మీద ఆయన నిజాయితీతో కూడిన అబిప్రాయం వినాలని ఉంది నాకు.



25 comments:

మంచు said...

80'స్ నవల్ని 80'స్ లొనే చదవాలి.. కొన్ని ఆ తరువాత చూస్తే / చదివితే ఇలా కామెడీగానే వుంటాయ్.. కొన్ని బావుండొచ్చు .. కానీ అన్ని కాదు .. అప్పట్టి పరిస్తితులకు, అప్పటి జనాల థింకింగ్ కు అప్పట్లొ అది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అయివుండొచ్చు .. ఈ నవల నేను చదవలేదు కానీ అంత ప్రజాధారణ పొదింది అంటే అప్పట్లొ చాలా విషయమే వుండి వుండాలి అని నా అభిప్రాయం :-))

శ్రీనివాస్ said...

ఆ పిచ్చి రోజుల్లో ఈ నవల ఒక వారపత్రికలో వచ్చేది .. జనం ముందు రోజు రాత్రి నుండే తెగ ఎదురు చూసేవారు. తెచ్చుకుని హడావుడిగా అ మూడు పేజీలు చదివితే గాని మనసు శాంతించేది కాదట.

Anonymous said...

I agree with manchu pallaki.

karthik said...

priyuralu piliche is the best in yandamuri novels..
this one as you said is comedy in certain things..

-Karthik

కన్నగాడు said...

మంచుపల్లకి గారన్నట్టుగా ఎప్పటి నవలలు అప్పుడే బాగుంటాయి, అయినా 1984లో ఎంత మందికి కంప్యూటర్లంటే తెలుసు అందులో రామ్ ర్యామ్ అంటే తెలుసు, ఏదో వాటిని ఆసరాగా తీసుకొని మంచి కథనే తయారు చేసారనే నమ్ముతున్నాను.
ప్రఖ్యాత కాల్పనిక వైజ్ఞానిక రచయిత జూల్స్ వెర్న్ "From the Earth to the Moon" అనే నవలలో ఒక పెద్ద ఫిరంగిని పేల్చడం ద్వారా దాని గుండును చంద్రని పైకి పంపవచ్చని రాసారు, అది సాధ్యం కాదని ఇప్పుడు 8వ తరగతి పిల్లవాడైనా చెబుతాడని ఆ నవలని తీసిపారేయలేం కదా!

శ్రీవాసుకి said...

నేను మంచుపల్లకి గారితో ఏకీభవిస్తున్నాను. 15 సంవత్సరాలనాటి ఆలోచనలకి ఇప్పటికి తేడా ఉంటుంది కదా. కింకాంగ్ కి అవతార్ మధ్య ఉన్న తేడాలాగా. అప్పటికి అది గొప్ప. తెలుగులో అదో హర్రర్ నవల. తర్వాత సినిమాగా, టి.వి సీరియల్ గా కూడా వచ్చింది.

Ramu S said...

ఎప్పుడు రాసిన నవల అయినా ఎప్పుడు చదివినా బాగుండాలి కదా! లేకపోతే అది మంచి నవల కోవలోకి రాదుకదా. తెలుగు నాట క్షుద్ర సాహిత్యాన్ని పెంచి పోషించిన ఘనులలో ఈ యండమూరి వారు ఒకరు. కథలో ఒక ఒరవడి తెప్పించడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి.
రచయిత అన్నట్లు...ఇప్పుడు కొత్త అవతారం ఎత్తి జనాలకు మనోబలం పెంచుకునే టెక్నిక్స్ చెబుతున్న యండమూరి ఇప్పుడు తులసిదళం వంటి క్షుద్ర సాహిత్యం గురించి ఏమంటారో అనేది ఆసక్తి కలిగించే అంశమే.
రాము

తెలుగు వెబ్ మీడియా said...

తులసి దళం నవల టివిలో సీరియల్ గా వచ్చినప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూశాను. అందులో ఒక్క ముక్క కూడా నమ్మశక్యంగా లేకపోవడం వల్ల సీరియల్ చూడడం మానేశాను. నేను నాస్తికుడిని. దెయ్యాలు, భూతాలు, కాష్మోరా లాంటి వాటికి నేను భయపడను. ఏమాత్రం నమ్మశక్యం కాని సీరియల్ చూసి చెవిలో పువ్వు పెట్టుకోవడం ఎందుకు అని ఆ సీరియల్ చూడడం మానేశాను.

శరత్ కాలమ్ said...

ఆ నవలలు సీరియలుగా వస్తున్న రోజుల్లో మా ఇంటిల్లాది కూడా ఆంధ్రభూమి వారపత్రిక కోసం ఆత్రంగా ఎదురుచూసిన వారమే. సూర్యాపేటలో కొత్త బస్ స్టాండ్ మా ఇంటికి దగ్గర్లోనే వుండేది. కొత్త సంచిక ఎప్పుడు వస్తుందా అని వీలయినప్పుడల్లా పుస్తకాల షాపు చుట్టూ గిరికీలు కొట్టేవాడిని. పుస్తకాల షాపతను నాకోసం ఓ సంచిక రిజర్వ్ చెసి వుంచేవాడు.

ఆ రోజుల్లో డాక్టర్ సమరం గారు మా ఇంటికి వస్తే ఈ నవలల ప్రస్థావన వచ్చింది. సమరం గారితో యండమూరి సమావేశం అయినప్పుడు సమరం గారు తమ నిరసన తెలిపారట. ఇకనుండి ఇలాంటి క్షుద్ర సాహిత్యం వ్రాయనని యండమూరి తెలిపారని డాక్టర్ గారు మాతో చెప్పారు.

తెలుగు వెబ్ మీడియా said...

అన్వేషిత సీరియల్ చూశారా? అందులో కూడా ఒక్క ముక్క నమ్మశక్యంగా ఉండదు కానీ అప్పట్లో ఆ సీరియల్ మంచి సెన్సేషన్?

Malakpet Rowdy said...

మాంత్రికులెవరైనా కనిపిస్తారేమో అని అర్ధరాత్రి 12:00 కి స్మశానాలకి వెళ్ళేవాడిని. ఒక్కరు కూడ కనబడలేదు. కానీ అక్కడ నన్ను భయపెట్టింది కుక్కలూ, వ్యభిచారులూనూ :))

సీరియల్ విషయానికి వస్తే మోర్స్ కోడ్ తో హిప్నటైజ్ చెయ్యడమనే సరికొత్త అండ పిండ బ్రహ్మాండమైన ప్రయోగాన్ని జీవితంలో మొదటి సారి విన్నా (చదివా). తేరుకోడానికి ఒక వారానికి పైగానే పట్టింది. అదే నేను చదివిన యండమూరి మొదటి + చివరి నవల. తప్పుగా అర్ధం చేసుకోకండి, మిగతావి చదివే అవకాశం రాలేదు.

Malakpet Rowdy said...

కానీ ఆ నవలలో నాకు బ్రహ్మాండంగా నచ్చింది ఎవడికో గుండు కొట్టించి, కుర్చీకి కట్టేసి, నెత్తి మీద చిల్లి కుండాలో ఐస్ పెట్టి టప్ టప్ టప్ అని నీటిబొట్లు వాడి నెత్తిమీద పడేలా చేసే టార్చర్. సూపరో సుపరది. నాకు అవకాశం వస్తే శరత్ మీద ప్రయోగిద్దామనుకుంటున్నా. దెబ్బకి శరత్ కాస్తా స్వామీ శరతానంద గా మారిపోతాడో లేదో చూడాలి :))

శరత్ కాలమ్ said...

@ రౌడీ
నన్ను శరతానందంగా చేస్తే చేసారు కానీ ఆ చేత్తోనే నాకు ఒక చక్కటి ఆశ్రమం, కొంతమంది హీరోయిన్లూ ఏర్పాటు చేయాలి మరి!

Kathi Mahesh Kumar said...

1.నవరసాల్లో భయానకం, భీభత్సం అనేవి కూడా రసాలని మీకు తెలుసా?
2.విశ్వనాధ సత్యనారాయణ గారి "బాణామతి" అనే నవలపేరు ఎప్పుడైనా విన్నారా?

తెలుగు వెబ్ మీడియా said...

దెయ్యాలు, భూతాలు, కాష్మోరా లాంటి వాటిని ఏమాత్రం నమ్మని నాస్తికులకి ఆ నవల చదివితే ఏమాత్రం భయం వెయ్యదు. నువ్వు కూడా నాస్తికుడివే కదా కత్తి.

మంచు said...

నవల లొ విషయాలు నమ్మడానికి , నవల నచ్చడానికి సంబంధం వుండదు ప్రవీణు.. సూపర్ మేన్, స్పైడర్ మేన్, బాట్మేన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హేరీ పొటర్, ఇవన్ని నిజ జీవితం లొ జరుగుతాయని ఎవడు అనుకొని సినిమా చూడడు కదా.. ఇది ఫిక్షన్ అయివుండొచ్చు.. మాంత్రికులు, క్షుద్రసక్తులు అన్ని ట్రేష్.. అంత మాత్రాన దానిమీద కొంత ఫిక్షన్ ఎందుకు రాయకూడదు..
నేను వెన్నల్లొ ఆడపిల్ల, అదెదొ సైన్స్ ఫిక్షన్ ఒకటి చదివా.. ఆ సైన్స్ ఫిక్షన్ అప్పట్లొ తెగ నచ్చెసింది.. ఇప్పుడు కామెడిగా వుండొచ్చెమో మరి..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రాము గారూ మీకు ఎక్కడైనా యండమూరి కనిపిస్తే ఈ నవల మీద ఆయన అభిప్రాయం కనుక్కొని మీ బ్లాగ్ లో పెట్టండి ప్లిజ్.

Anonymous said...

అప్పట్లో రంగనాయకమ్మ "తులసిదళం కాదు గంజాయి దమ్ము" అనే పుస్తకం రాసి ఈనవల్ని ఏకి అవతల పడేసింది.

Anonymous said...

ఇంకో అప్డేట్ ఏమిటంటే ఈ సీరియల్ వచ్చే టైం లో యండమూరి సార్ జ్యోతి అనే అమ్మాయితో స్నేహం/రొమాన్స్ చేసారు. తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. సార్ మీద కేసు జరిగింది. influence తో బయటకి వచ్చాడంటారు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తులసీదళం-గంజాయిదమ్ము పుస్తకం నెట్లో డౌన్ లోడ్ కి దొరుకుతుందా?

Malakpet Rowdy said...

Was it Jyoti or Kalyani?

prabhakarreddy said...

**** April 21, 2010 10:42 AM
Anonymous said...

ఇంకో అప్డేట్ ఏమిటంటే ఈ సీరియల్ వచ్చే టైం లో యండమూరి సార్ జ్యోతి అనే అమ్మాయితో స్నేహం/రొమాన్స్ చేసారు. తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. సార్ మీద కేసు జరిగింది. influence తో బయటకి వచ్చాడంటారు ****
కనీసం పేరు కూడా చెప్పుకోలేని anonymus గారు, ఇంకొకరి వ్యక్తిత్వం మీద విమర్శలు చేసే హక్కు మీకెక్కడిది? ** influence తో బయటకి వచ్చాడంటారు** వారు అన్నారు వీరు అన్నారు అనడమే కానీ మీ దగ్గర ఏమైనా ఖచ్చితమైన సాక్ష్యాలు ఉన్నాయా? జీవితం లో ఒక ఉన్నత స్థానానికి రావాలని చాలామంది తపిస్తుంటారు. తీరా అక్కడికి వచ్చాక ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండనివ్వరు కొంత మంది అసూయా పరులు. ఇలా పుకార్లు పుట్టించి ప్రచారం చేసే వాళ్ళు ఉన్నంత కాలం ఏమైనా అంటారు. anonymus గారు, ఇవే పుకార్లు మీ జీవితం లో మీ చుట్టు పక్కల వాళ్ళు ప్రచారం చేస్తే మీ స్పందన ఏమిటి?ఇంకొకరి వ్యక్తిత్వం మీద ఋజువు లేని ఆరోపణలు చేసే ముందు అది ఒక్కసారి ఆలోచించండి . "ఏదైనా చెప్పే ముందు నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో , అన్నిటికీ అవును అనే సమాధానం వస్తేనే అది ఇంకొకరికి చెప్పు -
1 . ఆ విషయానికి నిరూపణ ఉందా?
2 . అది నిజమా?
3 . అది చెప్పడం అవసరమా?"------------సోక్రటీస్

చదువరి said...

ఆ కిల్లరు సీరియల్ ను అభిమానించిన లక్షలాదిమందిలో నేనూ ఒకణ్ణి. :) అది ఆనాటి నవల, ఈనాటి నవల కాకపోవచ్చేమో! మంచుపల్లకి సరైనమాట చెప్పారు.

అది మంచిదో కాదోగానీ పాపులర్ మాత్రం అవును. అప్పటి జనం దాన్ని అభిమానించారు. అప్పుడు పాపులరైతే ఇప్పుడూ పాపులర్ కావాలనేం లేదు. దసరాబుల్లోడు సినిమా, వచ్చిన కొత్తలో తెగ ఆడేసిందంటారు.. ఇప్పుడు దాన్నీ, అక్కినేని అతినటననూ భరించగలమా? :)

ఆ నవల గురించి ఆయన ఇప్పుడేమంటారు అనే దాని గురించి ఆలోచిస్తే.. బహుశా డబ్బు కోసం రాసాను అనే సమాధానం చెప్పొచ్చు!

సుజాత వేల్పూరి said...

సెన్సేషన్ కోసం రాసే నవలలు అప్పటికప్పుడు నిలుస్తాయి కానీ తర్వాత వాటికి సాహితీ విలువ ఉండదు. తులసి దళం,తులసి అప్పుడు చదివిన వాళ్లు మళ్ళీ ఇప్పుడు చదివితే సిల్లీగానే అనిపిస్తుంది అందుకే! కానీ ఇందులో శ్రీనివాస్ పిళ్ళై పాత్ర, నెత్తి మీద టప్ టపా టప్ అంటూ నీటి చుక్కలు పడే ఏర్పాటు,మస్కిటో రిపెల్లర్ తో వామిటింగ్ సెన్సేషన్ కల్గించడం వంటి విషయాలు పరిశోధించి రాయలంటే బుర్ర కావాల్సిందేగా!

అరత్యుంగ విద్య గురించిన విషయాలు కూడా టెన్షన్ పుట్టిస్తాయి. విషయం ఏమో కానీ విషయ సేకరణ మాత్రం ఎక్కువే జరిగింది ఈ నవలల విషయంలో!

మల్లాది కూడా మిస్టర్ వి, శనివారం నాది వంటి సెన్సేషన్ నవలలు రాసినపుడు ఇలాంటి స్పందనే పాఠకుల నుంచి.
http://www.yandamoori.com..ఇది యండమూరి వెబ్ సైటు! అక్కడ ఎక్కువ వివరాలు పొందవచ్చు. మన అభిప్రాయమూ తెలపచ్చు.


అప్పుడు రాసిన ఈ క్షుద్ర సాహిత్యం గురించి యండమూరి ఇప్పుడేమంటారో తెలుసుకుంటే బాగానే ఉంటుంది.

@ చె.దె.పూ.దం,

తులసి దళం కాదు గంజాయి దమ్ము నవల నాకు తెలిసి ఆన్ లైన్లో లేదు. బయట దొరుకుతుంది.తులసి దళం నవలకు ముందు మాట రాసిన రచయిత డాక్టర్ కొమ్మూరి వేణు గోపాల రావు గారిని కూడా రంగనాయకమ్మ గారు ఈ పుస్తకంలో తిట్టడంతో ఆయన కేసు పెట్టారు. అది చాలా రోజులు నడిచింది.

తెలుగు వెబ్ మీడియా said...

తులసి దళం నవల చదివి విజయవాడలో ఒక అమ్మాయి మూఢ నమ్మకాలకి పోయి ఆత్మహత్య చేసుకుంది. అందుకే రంగనాయకమ్మ గారు ఆ నవలని విమర్శించారు.