ఇప్పుడు జగన్ ఏకంగా కాంగ్రెస్ పార్టీలోంచి బయటకొచ్చాక మళ్ళీ చావుమేళం మోగకుండా ఉంటుందా అని అనుకొన్నాను. ఈ ఉదయం సాక్షి పేపర్ చూశాక సందేహం తీరి పోయింది. మొదటి రోజు స్కోరు తొమ్మిది చావులు. రేపు, ఎల్లుండి, ఆ మరునాడు, ఆ తరువాత ఈ స్కోరు ఎంతకి చేరుతుందో?
మొదటి రౌండ్ వాళ్ళ ఓదార్పే ఇంకా పూర్తవలేదు. జగన్ రెండు, మూడు రౌండ్ల వాళ్ళ కుటుంబాలనెప్పుడు ఓదార్చాలి? ఈ ఫ్రెష్ రౌండ్ వాళ్ళనెప్పుడు ఓదార్చాలి? తన కొత్త పార్టీ గురించి ఎప్పుడు ఆలోచించాలి? దాన్ని ఎప్పుడు బలోపేతం చేయాలి? పైపెచ్చు అన్నకి ఈ ఓదార్పులో ఇప్పటి దాకా జనాన్ని చూసి చెయి ఊపీ ఊపీ చెయ్యి నొప్పి వచ్చిన విషయం, డాక్టర్లు చెప్పినట్టు విశ్రాంతి కూడా తీసుకోకుండా మళ్ళీ తన కార్యకలాపాల్లో మునిగి పోయిన విషయం కూడా మనకి తెలుసు కదా?
ఈ చచ్చే వాళ్ళ చావులు జగన్ కి చచ్చేంత చావు తెచ్చి పెడుతున్నాయి కాబట్టి గుండెలవిసి, గుండాగి చచ్చే వాళ్ళకి, ఆత్మహత్యలు చేసుకొని చచ్చే వాళ్ళకి నాదో విన్నపం... మన ప్రియతమ నేత సమయం, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎవరూ చావకండి.అంతగా చావాలనుకొంటే రేపు మనవాడు కొత్త పార్టీ పెట్టి, ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడు తీరిగ్గా చావండి. అప్పుడు అన్న సీఎమ్ గా అధికారగణాన్ని వెంటేసుకొని, మందీ మార్బలంతో మీ ఇంటికొచ్చి మీ వాళ్ళని మీ చావు గురించి విచారించి ఓదారుస్తూ ఉంటే ఆ కథా కమామీషూ వేరు కదా!!??