1890
దిండివనం, పుదుచ్చేరి దగ్గర, తమిళనాడు.
రాత్రి 11 గంటల సమయం.
టక టక అని తలుపు మీద కొట్టిన శబ్ధానికి టక్కున మెలకువ వచ్చింది జాన్ స్కడ్డర్ కి. గత ముప్పై యేళ్ళుగా ఆయన ఆ శబ్ధం వినగానే ఎంత నిద్రలోనైనా మేల్కొనడం అలవాటు చేసుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఆయనొక్కడే డాక్టరు, పాస్టరు కూడా. మూడో సారి కొట్టాక కింద సహాయకుడు వెళ్ళి తలుపులు తెరిచాడు. జాన్ పైన బాల్కనీలోనుండి కిందకు చూశాడు. కింద ఎవరో తమిళంలో మాట్లాడ్డం వినిపించింది. ఇంతలో గౌను సర్దుకొంటూ మరొక రూంలోంచి ఆయన ఇరవై యేళ్ళ కూతురు ఇడా కూడా బయటకొచ్చింది. ఆమె వైపు చూసి"ఏమ్మా, నిద్ర పట్టలేదా?" అనడిగాడు జాన్. ఆమె అమెరికానుండి వచ్చి రెండునెలలయినా ఇంకా ఇక్కడి కాలమానానికి పూర్తిగా అలవాటుపడలేదు.
కిందనుంచి ఆయన సహాయకుడు"సార్, పక్క ఊరునుంచి, కాన్పు కష్టమయిందట. బిడ్డ అడ్డం తిరిగిందని మంత్రసాని మధ్యాహ్నం నుండి తనకలాడుతూందట. మిస్సమ్మగారిని పంపమని వచ్చాడు" అని చెప్పాడు. మిస్సమ్మ అంటే ఇడా. ఆమె వచ్చి రెండు నెలలవడంతో ఆమె గురించి చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో తెలిసిపోయింది. అందరూ ఆమెని మిస్సమ్మ అని పిలుస్తారు.
ఆమెకి వైద్యం తెలియదు. పుట్టింది ఇండియాలో అయినా, తమ కుటుంబంలో అందరూ వైద్యులే అయినా, ఆమెని కూడా డాక్టర్ని చేసి తనతో పాటు ఉంచుకోవాలని జాన్ భావించినా ఆమెకి వైద్యమ్మీద అసలు ఆసక్తి ఏర్పడలేదు. పైపెచ్చు ఆనాడు భారతదేశంలో ఉన్న కరువు, పేదరికం అవన్నీ చూసి ఆమె అసలు మళ్ళీ ఇక్కడ కాలు పెట్టాలనుకోలేదు. అమెరికాలో చిన్నాన్న దగ్గర చదువుకొని అక్కడే ఎవరినయినా పెళ్ళి చేసుకొని సెటిల్ అవుదామని ఆమె ఆలోచన. తీరా ఆమె చదువు పూర్తయ్యేసరికి తల్లికి జబ్బుచేసింది. ఆమె కోలుకునేదాకా ఆమెకి సాయంగా ఉండడానికి రెండు నెలలక్రితమే ఇండియాకి వచ్చింది.
జాన్ వడివడిగా మెట్లు దిగి కిందికి వచ్చాడు. ఆయనతోబాటు ఇడా కూడా వచ్చింది. అక్కడ కిరోసిన్ దీపం పట్టుకొని ఒక బక్కచిక్కిన పేద బ్రాహ్మణుడు అతి దీనంగా అర్ధిస్తున్నాడు. ఇడా అప్పటికే తమిళం వచ్చు కాబట్టి అతడు చెప్పేది బాగా అర్ధం అయ్యింది. "అయ్యా, మధ్యాహ్నం నుండి మంత్రసాని తిప్పలు పడుతూనే ఉంది. ఏమీ ప్రయోజనం లేకపోయింది. మీరు మిస్సమ్మ గారిని పంపితే దాన్ని బతికించిన వారవుతారు" అని ప్రాధేయపడ్డాడు ఆ బాపడు.
"ఇడాకి అస్సలు ఏమీ చేతకాదు. నేను వస్తాను కావాలంటే" అన్నాడు జాన్. అతడు అందుకు అంగీకరించలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే వాదన అతగాడిది. వెళ్తే ఇడా వెళ్ళాలి లేకపోతే పెళ్ళాం బతుకు మంత్రసాని చేతిలో ఏమయితే అదవనీ! జాన్ ని తీసుకెళ్ళి ఆయన చేత పెళ్ళానికి కాన్పు చేయించడానికి ససేమిరా అంటున్నాడు. అది చూసిన ఇడాకి చిర్రెత్తి పైకెళ్ళిపోయింది. జాన్ కూడా ఆమె వెనకలే వెళ్ళిపోయాడు. సహాయకుడితో కాస్సేపు ప్రాధేయపడి ఆ వచ్చిన వ్యక్తి నిరాశగా వెనుతిరిగాడు.
ఆ రాత్రే ఇదే సంఘటన మరి రెండుసార్లు పునరావృతమయింది. ఈ సారి ఒక అగ్రకులంనుండి ఒక వ్యక్తి, ముస్లిం మతస్థుడు మరొకడు. ఇద్దరూ మిస్సమ్మ వచ్చి వైద్యం చేయకపోతే పెళ్ళాం దక్కదని ప్రాధేయపడ్డవాళ్ళే. జాన్ చేత కాన్పు చేయించడానికి ససేమిరా అన్నారు. మరుసటిరోజు మధ్యాహ్నం కల్లా జాన్, ఇడాలకు వార్త తెలిసింది. ఆ ముగ్గురు తల్లులూ, వాళ్ళ బిడ్డలూ చనిపోయారని.
అప్పట్లో ఉన్న సామాజిక కారణాలవల్ల అగ్రవర్ణాలు,అగ్ర వర్గాలకి చెందిన ఆడవారు మగ డాక్టర్లచేతిలో పురుడు పోసుకోవడానికి ఒప్పుకొనేవాళ్ళు కాదు. ఆడ డాక్టర్లు అప్పట్లో చాలా తక్కువ సంఖ్యలో ఉండడంచేత పెద్ద నగరాలలోనే ఉండేవారు.పల్లెలలో మంత్రసానులే కాన్పులు చేసేవారు. వాళ్ళ అనుభవం ఉపయోగించి సాధారణ కాన్పులు బాగానే చేయగలిగినా కష్టమైన కాన్పులు వాళ్ళ వల్ల కాకపోవడంతో తల్లీ,బిడ్డా ప్రాణాలకు తరచూ ప్రమాదం ఏర్పడేది.
కేవలం ఒక లేడీ డాక్టర్ లేని కారణంగా ముగ్గురు తల్లులు, వారి శిశువులూ అన్యాయంగా మరణించడం ఇడాని తీవ్రంగా కలచివేసింది. ఆ రాత్రి నిద్రలో ఇడా తన డెస్టినీని తెలుసుకొంది.పొద్దున్న లేవగానే జాన్ తో చెప్పింది, "నేను అమెరికాకి తిరిగి వెళ్తాను నాన్నా. మళ్ళీ ఇక్కడికి వస్తాను. అయితే ఈసారి డాక్టరుగా!"
ఆమె అమెరికాకి వెళ్ళి ప్రతిష్ఠాత్మకమైన కార్నెల్ యూనివర్సిటీలో వైద్యవిద్య అభ్యసించింది. అప్పట్లో కార్నెల్ లో ఆడవారిని చేర్చుకొనేవారు కాదు. ఆడ వారిని చేర్చుకోవడం ఇడా బ్యాచ్ తోనే మొదలయింది. పట్టా చేతికి రాగానే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయ్యేదాకా ఆగకుండా వెంటనే ఇండియాకి తిరుగు ప్రయాణమైంది ఇడా.ప్రాక్టికల్ ట్రైనింగ్ తండ్రి దగ్గర పొందవచ్చనేది ఆమె ఆలోచన. అయితే ఆమె వచ్చిన కొద్ది రోజులకే జాన్ చనిపోయాడు.
దేవుడిపైన భారం వేసి ఆమె వెల్లూరు సమీపంలోని ఒక గ్రామంలో చిన్న గదిలో తన ప్రాక్టీసు మొదలు పెట్టింది. అప్పట్లో శిక్షణ పొందిన నర్సులు చాలా తక్కువగా ఉండేవారు. దానితో ఇడా గ్నానమ్మాల్ అనే అమ్మాయిని తన దగ్గర సహాయకురాలిగా పెట్టుకొని ఆమెకి అన్నీ తనే నేర్పించింది. ఆమె ఆ తరువాత 50 సంవత్సరాలు ఇడాతోనే పని చేసింది.
అలా ఒక గదిలో ప్రారంభమైన ఇడా ఆసుపత్రి అచిరకాలంలోనే ఇంతై...ఇంతింతై... అన్నట్లు అభివృద్ధి చెందింది. అమెరికాకి చెందిన ఒక భాగ్యవంతురాలు ఇచ్చిన విరాళంతో ఆసుపత్రిని అభివృద్ధి చేసి నర్సింగ్ కాలేజ్, ఆ తరువాత మెడికల్ కాలేజ్ ఇలా మహా వృక్షంలా ఎదిగి పోయింది. అదే వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఇవాళ ఆ కాలేజ్ మరియు హాస్పిటల్ లో అంతర్జాతీయ స్థాయి డాక్టర్లు, ఆపరేషన్లు, రీసెర్చి నడుస్తున్నాయి. కార్పొరేట్ సంస్కృతికి దూరంగా సేవ పరమావధిగా నడుస్తున్నది.
ఇడా స్కడ్డర్ తను బతికినంతకాలం అక్కడే సేవలందించారు. ఎప్పుడు అవకాశం దొరికినా ఆమె తన జీవితాన్ని మార్చిన ఆ The Night of The Three Knocks గురించి అందరితో చెప్పేవారు.
4 comments:
బాగుందండి. ఆమెకి నా అభినందనలు.
ఇంత గొప్ప చరిత్ర ఉన్న మనము కాన్పు చెయ్యడానికి వైద్యులని తయారు చేసుకోవలేకపోవడం మన వ్యవస్థ వైఫల్యమే.
ఇటువంటివి విన్నప్పుడు ఆ రోజుల్లో పుట్టనందుకు సంతోషించాలో,లేక వెన్నుపూస లేక ఈ అమెరికాలో కూర్చొని సొల్లు కబుర్లు చెబుతున్న నన్ను నేను నిందించుకోవాలో తెలియడం లేదు.
ఆ ముగ్గురు తల్లులు ఎంత నరకం అనుభవించి ఉంటారో? ఆ కుటుంభాలు గుండెలు అవిసేటట్లు ఎంతగా బాధపడి ఉంటారో తలుచుకుంటూ ఉంటె మనసు ద్రవించి పోతుంది.
inspirational
aadrsha praayaamaina ituvamti vaari jeevitaalu dhanyamulu. puttaamaa chachchaamaa ani kaakumdaa jeevitaanni elaasaardhakam chesukovaalo aacharanadvaara chupaaru. jaisriraam
చదవటం పూర్తయ్యేసరికి కళ్ళవెంట నీరు వచ్చేసిందండీ.
Post a Comment